21, ఏప్రిల్ 2024, ఆదివారం

వీడ్కోలు మిత్రమా...

 వృత్తి అవసరం రీత్యా యాధృచ్ఛికంగా కలిశాను. ఒక రోజంతా ఆయనతో గడిపాను. అత్యున్నత ప్రమాణాలు కలిగిన వ్యక్తి. మంచి మనసున్న మనిషి. సినర్జీజ్ కాస్టింగ్స్ లిమిటెడ్ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఒకసారి కలిస్తే ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తిత్వం ఆయన స్వంతం. ప్రతి పండగకూ శుభాకాంక్షలు... అడపాదడపా ఎవరికో ఒకరికి ఉద్యోగం కోసం నేను పెట్టే పొట్టి సందేశాలకు క్రమం తప్పని జవాబులు... మొన్నా మధ్య డాక్టర్ గుంటూరు వరుణ్ (కార్డియాక్ సర్జన్) ట్రస్టు పెడుతున్నప్పుడు శేఖర్ తో సుదీర్ఘంగా మాట్లాడాను. ఈ ఏడాది ఉండలేనని, వచ్చే సంవత్సరం తప్పనిసరిగా ట్రస్టులో భాగస్వామి అవుతానని హామీ ఇచ్చారు. అంతలోనే ఈ దుర్వార్త...  యూకేలో తీవ్ర గుండెపోటుతో కుప్పకూలిపోయారని... మంచి మిత్రులు... పది మందికి ఉపయోగపడే వ్యక్తులు అనుకున్న వారిని ఒక్కొక్కరినీ కోల్పోతున్నా... మనసులో ఎక్కడో వెలితి. ఇదీ అని చెప్పలేని నొప్పి. శేఖర్ ని చివరిసారిగా చూడాలన్న బలమైన ఆకాంక్ష... వెళ్లలేని నిస్సహాయత... 


మహా మనిషి ప్రస్థానం ముగిసింది. ఇప్పుడు ఆయన సహచరులపై ఓ గురుతర బాధ్యత పడింది. ఆయన కలల సౌధాన్ని సర్వోన్నత స్థాయిలో నిలబెట్టడం, ఆయన ప్రారంభించిన అనేక సేవా కార్యక్రమాలను కొనసాగించడం... చిన్న విషయం కాకపోవచ్చు. దారి అస్పష్టంగా ఉండవచ్చు. కాని ఆయన అందించిన క్రమశిక్షణ, ఆలోచన మీతోనే ఉన్నాయి. ఆయన కుటుంబం నుంచి కొనసాగించగలిగే వారు ఉన్నారేమే చూడాలి. లేకపోతే భాగస్వాముల నుంచి వెతకాలి. చేయాల్సింది జట్టు సభ్యులు మాత్రమే. శేఖర్ నడిచిన మార్గం సరయినదే అయితే ఆయన ఉన్నా లేకపోయినా ఆ దారి వెలుగులీనుతూనే ఉండాలి. దుఃఖంతో పూడుకుపోయిన ప్రతి కంఠమూ ఆయన ఆశయాన్ని నినదించాలి. ఆయన కోసం కన్నీరు కార్చిన ప్రతి హృదయమూ దృఢంగా నిలబడాలి. కష్టమే... కాని అసాధ్యం కాదు. శేఖర్ నమ్మింది, ఆచరించిది కూడా అదే.


4, మార్చి 2024, సోమవారం

ఆ డాక్టరు గదిలో కాసేపు...

 డాక్టరు గారి గది ప్రశాంతంగా ఉంది. విశాలమైన ఆ గదిలో ఆయన సీటు వెనుక ఆయన నిరంతరం జపించే దేవుడి బొమ్మలు... వరుసగా పూల అలంకరణ. ఏసీ చేస్తున్న నిశ్శబ్ధ సడి... కంటికి ఇబ్బంది లేని దీప కాంతి... బ్లూ కలర్ సర్జన్ డ్రెస్ లో డాక్టర్ గారు.

ఎదురుగా రోగి కుమార్తె.

ఆ పక్కనే నేను... వారిద్దరినీ మార్చి మార్చి చూస్తూ...

మంద్ర స్వరంతో, హృదయ లోతుల్లో నుంచి వచ్చే తడి మాటలు... ఆచితూచి వస్తున్నాయి. అప్పటికే దుఃఖ భారంతో కుంగిపోయిన ఆమె ముఖంలోని ఛాయలను గమనిస్తూ డాక్టర్ గారు చెప్పుకుంటూ వెళ్తున్నారు.

‘వచ్చినప్పటి నుంచి ఇప్పటికి పెద్ద మార్పు ఏమీ లేదు. ఓ వైద్యుడిగా ఇంత వరకూ చేయాల్సిన అన్ని ప్రయత్నాలూ చేశాను. నావైపు చేయాల్సిందేమీ లేదు. ఆమె 5వ మెట్టుపై ఉంది. 95 మెట్లు ఇంకా ఎక్కాలి. ఇన్ని రోజుల మీ ప్రయాస, ప్రయత్నం, వ్యథ మధ్యన మా కృషితో ఆమె ఇప్పటికి ఎక్కింది ఒక్క మెట్టు మాత్రమే. ఇక మీరు నిర్ణయం తీసుకోవలసిని సమయం వచ్చేసిందనుకుంటున్నా. తల్లి విషయంలో నిర్ణయం తీసుకోవలసి రావడం ఎంత పెయినో నాకు తెలుసు. నేను అర్థం చేసుకోగలను. కాని అంతకు మించి ప్రత్యామ్నాయం లేదనుకుంటున్నా. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను సహకరించడానికి సిద్ధం. ఈ రెండు రోజుల నుంచి నేను మీకు పెద్దగా చేసిన ట్రీట్ మెంట్ ఏమీ లేదు. అందుకే ఒక్క రూపాయి చార్జ్ చేయవద్దని అక్కౌంట్స్ లో చెప్పాను. ఏం చేద్దాం చెప్పండి...’

డాక్టర్ గారి మాటను వింటూ దుఃఖం ఆపుకుంటున్న ఆ యువతి కళ్లు ఒక్కసారిగా తడి అయ్యాయి. పెగుల్చుకున్న గొంతుతో...

‘‘నిన్న ఉదయం అమ్మ దగ్గరకు వెళ్లాను. అప్పుడే కళ్లు తెరిచింది. అమ్మని నేనేమీ పట్టుకోలేదు. దగ్గరగా నిలబడి ‘అమ్మా, నేనమ్మా... నా వైపు  చూడు’ అని పిలిచా. నా వైపు తలతిప్పి చూడడానికి ప్రయత్నించింది. కాని చేయలేకపోయింది. అది చూసిన తరువాత చిన్న ఆశ... ‘ఆ డాక్టరు’ గారు చెప్పినట్లు కొంత సమయం తీసుకుంటే అమ్మ వచ్చేస్తుందేమో? ఓ నాలుగు రోజులు చూస్తే అమ్మ మళ్లీ నాకు తోడు ఉంటుందేమో? ఆశగా ఉంది. అమ్మ కదా.. డాక్టర్...’’

గొంతు జీర పోయింది. తల మెల్లగా కిందకు దించేసింది. బహుశా కన్నీటి చుక్కని చూపించడం ఇష్టం లేకనేమో..?

డాక్టరు గారు క్షణం కూడా ఆగలేదు...

‘‘అయ్యో... అమ్మ ఎవరికైనా అమ్మేనమ్మా... నిర్ణయం మీదే. తప్పకుండా. సామాజికంగా, ఆర్థికంగా కూడా ఆలోచించి చెప్పడం నా బాధ్యత. నాన్న ఇప్పటికే మానసికంగా బాగా నలిగిపోయారు. ఆయన కుంగుబాటు చూస్తూ నాకు బాధగా ఉంది. అమ్మ కోసం మీరు, భార్య కోసం ఆయన పడుతున్న తపన కనిపిస్తోంది. కాని... మీరు పెడుతున్న దానికి తగ్గ ఫలితం రాకపోతే... అప్పుడు వచ్చే పెయిన్ భరించడం కష్టం... అందుకనే మీకు ఇలా చెప్పాల్సి రావడం. మరోలా అనుకోకండి. మీరు చెప్పినట్లే చేద్దాం. ఇంత చేసిన తరువాత ఆమెను తీసుకొని రాలేకపోతే మాకూ మానసికంగా ఇబ్బందిగానే ఉంటుంది. సరే కానీయండి. ఇప్పటి నుంచి మీకు ప్రధాన వైద్యుడిగా ‘ఆ డాక్టరు గారే ఉంటారు’... మీ నమ్మకం ఫలించాలని భగవంతుడిని కోరుకుంటున్నా...’’ సరేనమ్మా అంటూ డాక్టరు గారు లేచారు...

ఈలోగా రోగికి చికిత్స చేస్తున్న ‘ఆ డాక్టరు’ గారు వచ్చారు.

వస్తూనే... ‘ఫర్లేదమ్మా... అమ్మని తెచ్చుకుందాం. ఓపిగా ఉండండి’ అంటూ చెపుతూ ఆ యువతితో కలసి రోగిని చూడడానికి బయలుదేరారు.

నేను వచ్చిన పనిచూసుకుని ఇంటికి బయలుదేరాను.

వీక్లీ ఆఫ్. పెందలాడే పొడుకున్నా. ఎందుకో హఠాత్తుగా ఉదయం నాలుగున్నరకి మెలుకువ వచ్చింది. ఓ రెండు గంటలు ‘సూపర్ సింగర్’ తో కాలక్షేపం చేశా.

ఆరున్నరకి ఆసుపత్రి నుంచి ఫోన్...

‘సార్, రాత్రి ఆమెని డిక్లేర్ చేశాం’... అంటూ.

జీవితంలో ఎన్నడూ దేవుడిని నమ్మని, వైద్యులని కేవలం డబ్బు మనుషులగానే చూస్తూ వచ్చిన నేను మొదటిసారిగా ‘ఈ దేవుడు చల్లగా ఉండాలి’ అని అనుకున్నా. డబ్బు మనుషులను కాటేస్తున్న కాలంలో, మాటకి, మంచికి విలువల వలువలు తొడగలేని దయనీయమైన సమయంలో ఈ డాక్టరు ఎలా? పది కాలాలపాటు మనిషిగా నిలబడతాడా? నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు సజీవమై సాక్షాత్కరిస్తాయా? మొన్నటి వరకూ వేధిస్తున్న ప్రశ్నలు ఇప్పుడు కళ్ల ముందుకు వచ్చి కరాళ నృత్యం చేస్తుంటే గుండె బరువెక్కింది. శ్వాస కష్టంగా...  నా ఊపిరి నాకే వినిపిస్తోంది. ఇంటికి వచ్చిన చుట్టాల పలకరింపులు కూడా పట్టనంత నిశ్చల అలజడేదో... కాలంతో పనిలేకుండా నిరంతరాయంగా ఉవ్వెత్తున ఎగిసిపడే తూర్పు తీరపు కెరటం మాటున ఒదిగిపోవాలన్న చంచలమైన ఆకాంక్ష బలంగా నన్ను లాగేస్తోంది.

(పీఎస్...: యాధృచ్ఛికంగా పైన చెప్పిన ఫోన్ రావడానికి కొద్ది సమయం ముందే ఓ మీడియా మిత్రుడి ఫోన్...

‘డాక్టరు గారు రైతులకు నాలుగు కోట్లు విలువ చేసే చికిత్సలు ఉచితంగా చేస్తున్నారన్న వార్త రాయమంటే ఆయన ఏడాదికి ఇచ్చే రూ.60 వేలు యాడ్ కి ఇన్ని సార్లు ఫోన్ చేస్తారేంటి?’ అంటూ ఓ రిపోర్టర్ చిరాకుగా వ్యాఖ్యానించారు’ అని చెప్పారు.

అదేమైనా పని చేసిందేమో... అందుకే ఎప్పుడూ లేనిది ఇలా... నేనూ మీడియాలోనే ఉన్నా... మరోసారి నాపై నేనే... రోతతో, అసహ్యంతో కేకలు వేసుకోవాలనిపించి...)